NewsWaves.news

టీడీపీలో అంతర్మథనం : తాజా రాజకీయ పరిణామాలపై అధినేత ఫోకస్

తెలుగుదేశం పార్టీని వలసల భయం వేధిస్తోంది. పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాసరావు, శరగడం  అప్పలనాయుడు , అమలాపురం ఎంపీ రవీంద్రబాబు టీడీపీని వీడి వెళ్ళిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇలా కీలకనేతలు జారిపోతుండటం పార్టీకి తీరని దెబ్బే అవుతుంది.

ఎందరు నేతలు పార్టీని వీడి వెళ్ళిపోయినా, తమకు  ఏమీ  నష్టం లేదని టీడీపీ పెద్దలు  పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం ఎన్నికల గుబులు వారిని వెన్నాడుతూనే ఉంది.

 విపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలు, నాయకుల వలసలతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేసవితోపాటే వేడెక్కుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు   పార్టీ పరిస్థితులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.  ద్వితీయశ్రేణి నాయకులతో, పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న నేతలతో  సమావేశాలు  జరుపుతున్నారు. రాజకీయ పరిస్థితులపై, పార్టీలో తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

రాష్ట్రంలోని  రాజకీయ పరిస్థితులపై పార్టీ శ్రేణులకు వివరిస్తూ మార్గనిర్దేశం చేస్తున్నారు. టీడీపీని రాజకీయంగా అప్రదిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షాల వ్యూహాలను, విమర్శలను  దీటుగా తిప్పికొట్టాలని, వాస్తవాలను ప్రజలకు విన్నవించాలని సూచిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నేతలు, కార్యకర్తలకు  ధైర్యం నూరిపోస్తున్నారు.

ఎన్నికల సమయంలో మరింత ఉత్సాహంగా పార్టీకోసం పనిచేయాలని, ఎక్కడైనా పార్టీని దెబ్బతీసే యత్నాలు జరుగుతున్నాయని పసిగడితే వెంటనే బహిర్గతం చేయాలని  సూచిస్తున్నారు.

   ఇటీవల తెరాస నేత  కేటీఆర్‌  వైకాపా అధినేత జగన్‌ను కలవడం, తెలంగాణ మంత్రి తలసాని తరచు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు రావడాన్ని టీడీపీ నిశితంగా  గమనిస్తోంది. ఎన్నికల క్లిష్ట సమయంలో పార్టీని వీడి వెళ్ళవద్దని,  పార్టీకి విధేయలను, పార్టీకోసం నిరంతరం శ్రమించేవారి సేవలను అధిష్ఠానం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని హితవు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఒకవైపు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తూనే, మరోవైపు కీలకనేతలు “సైకిల్ దిగి”  పోకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు.  

Related Articles