NewsWaves.news

బాబూ ఏమిటిది! అటు అవంతి…ఇటు ఆమంచి.. నేడు ర‌వీంద్ర‌బాబు..

   ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. నేతల తీరు తల బొప్పి కట్టిస్తోంది. ఉత్తరాంద్రలో టీడీపీకి మంచి ఓటు బ్యాంకింగ్ ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలనుంచి కేంద్ర మంత్రి పదవుల స్థాయికి వెళ్ళిన నేతలు ఎందరో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభంజనంలోను తట్టుకుని నిలబడిన సైకిల్ పరుగు వీరులు ఉన్నారు. అలాంటి ఉత్తరాంధ్రలో టీడీపీ సీనియర్ నాయకుడు, అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసి వైకాపాలో చేరారు.

అవంతి శ్రీనివాస్ కు విశాఖ జిల్లాలోను, ఉత్తరాంధ్రలోను మంచి పట్టు ఉంది. ప్రజల నాడి తెలిసిన నేతగా పేరుంది. అటువంటి నాయకుడు పార్టీలో తగిన ప్రాతినిధ్యంలేదంటూ బయటికి వచ్చారంటే సీరియస్ గానే ఆలోచించాల్సిన విషయం. 

పార్టీ అధినేత వైఖరిపై అవంతి కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీతీరుపై బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేసిన సంద‌ర్భాలు అనేకం. భీమిలినుంచి పోటీచేయాల‌నేది అవంతికి ఎప్ప‌టినుంచో కోరిక‌. కానీ ఆశించిన స్థానం నుంచి టిక్కెట్ రాలేదు. భీమిలి నియోజ‌క‌వ‌ర్గంతో  అవంతికి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయ‌న పోటీచేస్తే తిరుగులేద‌నే న‌మ్మ‌క‌మూ ఉంది.

            మ‌రోవైపు…ప్ర‌కాశం జిల్లాలో చీరాల కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం. రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే నేత‌లు అనేక‌మంది ఇక్క‌డినుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. చీరాల నియోజ‌క‌వ‌ర్ ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై, రాజ‌కీయ జ‌న‌బాంధవుడుగా పేరు ప‌డిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైకాపాలో చేరారు. 

చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీతో, ప్ర‌భుత్వంతో ఏమాత్రం సంబంధ‌లేని వ్య‌క్తులు, శ‌క్తుల ప్రాబ‌ల్యం త‌న‌కు మ‌న‌స్తాపం కలిగించింద‌ని ఆమంచి విమ‌ర్శించి పార్టీనుంచి వైదొల‌గారు. వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.


ఈరోజు అమ‌లాపురం పార్ల‌మెంట్ స‌భ్యుడు పి. ర‌వీంద్ర‌బాబు వైకాపాలో చేరారు. టిడిపిని వీడి వైకాపాలో చేరినందుకు త‌న‌కు పుట్టింటికి వ‌చ్చినంత ఆనందంగా ఉంద‌ని తెలిపాడు ర‌వీంద్ర‌బాబు.

         పార్టీలో ఇద్ద‌రు సీనియ‌ర్ నాయ‌కులు పార్టీని వీడి ఎందుకు వెళ్ళార‌నే విష‌యమై టీడీపీ అధినేత చంద్ర‌బాబు కొంచెం లోతుగానే ప‌రిశీలించాల్సి ఉంది. మ‌రో రెండు నెల‌ల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ స‌మ‌యంలో స‌మీక‌ర‌ణ‌లు ఇంత స్పీడుగా మారుతుంటే కిమ్మ‌న‌కుండా కూర్చునే ప‌రిస్థితి అంత క‌రెక్టు కాదేమో. చంద్రబాబు ఇప్పుడైనా సింహావ‌లోక‌నం చేసుకుని ఇలాంటి ప‌రిస్థితి పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త ప‌డాలి.

పార్టీని మరింత బ‌లోపేతం చేయాల్సిన త‌రుణంలో ఇలాంటి సున్నిత అంశాల‌పై సునిత ప‌రిశీల‌న జ‌ర‌పాల్సిందేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. బ‌లాబ‌లాలు బేరీజు వేసుకుంటూ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో ఎదురైన అనుభ‌వాలు స‌మ‌న్వ‌యం చేసుకుని దిద్దుబాటు దిశగా న‌డ‌వ‌క త‌ప్ప‌దు. ద్వితీయ‌శ్రేణి నాయ‌కుల మ‌నోధైర్యం స‌డ‌లిపోకుండా చూసుకోవ‌ల‌సిన బాధ్య‌త కూడా బాబుదే.

Related Articles