NewsWaves.news

వైయస్సార్సిపి పార్టీ ఓట్లను చీల్చడానికే ప్రజాశాంతి పార్టీ… యాంకర్ శ్వేతారెడ్డి

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ గత కొద్ది రోజుల క్రితం పలు నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా యాంకర్ శ్వేతారెడ్డిని హిందూపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు.కాగా యాంకర్ శ్వేతారెడ్డి తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కె.ఎ.పాల్ పై విమర్శలు చేశారు.

మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరుని పాల్ ప్రకటించారని, ఆ తర్వాత ఇటీవల కాలంలో జరిగిన ఒక సభలో తాను అడ్రస్ లేకుండా పోయానని పాల్ ప్రకటించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఈ నెల 21వ తేదీ వరకు 10,000 సభ్యత్వాలను చేయించమని చెప్పారని, కానీ 21వ తేదీ రాకముందే వైజాగ్ లో నిర్వహించిన ఒక సభలో శ్వేతా రెడ్డి అడ్రస్ లేకుండా పోయింది అంటూ వ్యాఖ్యలు చేయడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని శ్వేతా రెడ్డి అన్నారు.

హిందూపురం టికెట్ ని మరెవరికైనా అమ్ముకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అంటూ ఆమె ప్రశ్నించారు. అంతేకాదు ప్రజాశాంతి పార్టీ కి ఒక సిద్ధాంతం కానీ, ఒక ఎజెండా కానీ లేదని, పాల్ నోరు తెరిస్తే చాలు ట్రంప్,ఒబామా అంటూ ఉంటారని, మిలియన్స్, ట్రిలియన్స్, డాలర్లు అంటూ చెప్పే పాల్ అమరావతి అభివృద్ధికి పది కోట్ల రూపాయల కూడా ఎందుకు కేటాయించలేదని శ్వేతా రెడ్డి ప్రశ్నించారు.

అంతేకాకుండా సభ్యత్వం పేరుతో 10,100 రూపాయలను వసూలు చేస్తున్నారని,అలా ఎందుకు చేస్తున్నారో తెలపాలని డిమాండ్ చేశారు.పాల్ వ్యవహారం క్రిస్టియన్ కమ్యూనిటీని అవమానపరిచేలా ఉందని, వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చేందుకు రాజకీయం చేస్తున్నట్లుగా తనకు అనుమానం ఉందని శ్వేతా రెడ్డి ఆరోపించారు.

Related Articles