NewsWaves.news

అపురూపం…అర్థనారీశ్వరమ్- ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాగంటి



 ఆంధ్రప్రదేశ్ లోని,  రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధ  పుణ్యక్షేత్రం ‘యాగంటి’. ఈ క్షేత్రంలో ఉమామహేశ్వర లింగం కొలువై వుంది. అర్ధనారీశ్వర రూపంతో అలరారే  శివపార్వతులు ఇక్కడ అదే రూపంతో  లింగాకారంలో సాక్షాత్కరించడం ఇక్కడి విశేషం.

యాగంటి క్షేత్రానికి రాగానే అక్కడ కనిపించే పెద్దపెద్ద పర్వతాలను చూడగానే మాటలలో వర్ణించలేని అనుభూతి కలుగుతుంది.  శిల్పి చెక్కినట్టుగా ఇక్కడి పర్వతాలు నిట్టనిలువుగా వుండి కనువిందు చేస్తాయి. సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి.

మొదట యాగంటిలో వేంకటేశ్వర స్వామిని  ప్రతిష్ఠించాలని అనుకున్నారన్న కథనం  ప్రచారంలో వుంది. ఇక్కడి దేవాలయంలో ప్రతిష్ఠించడానికి వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా చెక్కారట. అయితే విగ్రహం కాలిలో లోపం కనిపించడంతో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మనస్కరించలేదు. ఆ ప్రాంతంలోనే స్వయంభువుగా వెలసిన ఉమామహేశ్వర లింగాన్ని తెచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించారు.

   మరో కథనం కూడా ప్రచారంలో వుంది. తిరుమలశ్రీ వేంకటేశ్వరాలయం నిర్మాణ  సమయంలో అక్కడ ప్రతిష్ఠించడానికి విగ్రహాన్ని యాగంటిలోనే చెక్కించారట. అయితే విగ్రహం కాలిని చెక్కడంలో  లోపం ఏర్పడటంతో ఆ విగ్రహాన్ని ఇక్కడే విడిచిపెట్టేశారట. ఇప్పటికీ ఆ వేంకటేశ్వర విగ్రహం  యాగంటిలో పూజలు అందుకోవడం విశేషం. శివ కేశవుల అభేద తత్వానికి ఇదొక చక్కని నిదర్శనంగా చెప్పుకుంటారు.


        యాగంటి ఉమామహేశ్వరాలయంలోని  ‘అగస్త్య పుష్కరిణి’ లో అగస్త్య మహర్షి  స్నానం చేశాడని  స్థలపురాణం పేర్కొంటోంది. ఈ  పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుంచి జాలువారినట్లు  వుంటుంది. ఎక్కడో పుట్టిన జలధార పర్వతాల్లోంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరణిలోకి చేరుతుంది.  ఏ కాలంలోనైనా ఈ పుష్కరణిలో నీరు ఒకే మట్టంలో వుండటం  మరో విశేషం. ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు వున్నాయని, ఇందులో స్నానం చేస్తే దీర్ఘరోగాలు మటుమాయమవుతాయని భక్తుల విశ్వాసం

 యాగంటి క్షేత్రంలో కాకులు కనిపించవు. ఇక్కడ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అగస్త్యుడు  సంకల్పిస్తే, విగ్రహం కాలిలో సూక్ష్మ లోపం కారణంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వీలులేక పోయింది. అందుకు  చింతించి  అగస్త్యుడు తపస్సు చేశాడు. ఆ సమయంలో అక్కడ  కొన్ని కాకులు చేరి అరిస్తే  ఆయన తపస్సుకు  భంగం వాటిల్లింది.    అగస్త్యుడు ఆగ్రహించి,  ఈ క్షేత్రంలో కాకులకు ప్రవేశం లేదని శపించారని, అందుకనే  ఇక్కడ కాకులు కనిపించవని పెద్దలు చెబుతారు.

యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేను అంటూ కాలజ్ఞానవేత్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి (బ్రహ్మంగారు)  కాలజ్ఞానంలో చెప్పారు.  ఈ బసవన్న ఎప్పటికప్పుడు ఆకారం పెంచుకుంటూ వుంటాడు.

కాలజ్ఞానం  రచించింది ఇక్కడే

పర్వతం మీద వున్న వివిధ గుహలకు,  ఆలయాలకు చేరడానికి మెట్ల మార్గాలు చూడటానికి చాలా బాగుంటాయి.  యాగంటిలో ప్రధాన గోపురం ఐదు అంతస్తులతో వుంటుంది. ఈ గోపురాన్ని దాటగానే రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాలయం, గర్భాలయంలో లింగరూపంలో వున్న ఉమా మహేశ్వరుల రూపాలు దర్శనమిస్తాయి. ఇక్కడే  ఒక గుహలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని, శిష్యులకు కాలజ్ఞానం బోధించారని చెబుతారు.
 

  కర్నూలుకు సుమారు 100 వంద కిలోమీటర్ల దూరంలో యాగంటి ఆలయం వుంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుంచి బస్సులో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.      

Related Articles