NewsWaves.news

భక్త సులభుడు జలకంఠేశ్వరుడుబ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

ప్రసిద్ధ ఆలయాలకు నిలయం  తమిళనాడు రాష్ట్రం. అక్కడ అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. పుణ్యతీర్థాలు, దివ్యధామాలు, మహాక్షేత్రాలు అనేకం నెలవై ఉన్నాయి. సదాశివుడిని ఎలా కొలిచినా, పేరుతో పిలిచినా..సదా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు.

సురాసుర పూజితుడైన పరమశివుడు తలపై గంగను ధరించి గంగాధరుడయ్యాడు, పార్వతిదేవికి తనలో సగభాగమిచ్చి ..అర్థనారీశ్వరుడయ్యాడువిశ్వశ్రేయస్సుకోసం  కంఠంలో గరళం  దాచుకుని నీలకంఠుడయ్యాడు, ముల్లోకాలను పాలిస్తూ..నిఖిల లోకేశుడయ్యాడు.. లయకారుడు, భక్తవత్సలుడు, భక్త సులభుడు.. భస్మాంగధరుడు.. గౌరీవల్లభుడుఇలా  వేవేల నామాలతో భక్తులు సదాశివుని స్మరిస్తారు.  అందుకే భక్తులు పేరుతో పిలిచినా, నేనున్నానంటూ అభయమిస్తాడు బోళా శంకరుడు.  

  అఖండ శిల్పకళా సౌందర్యంలో, నిత్యం శివనామ స్మరణతో మార్మోగుతున్న అతిపురాతన శైవక్షేత్రం, తమిళనాడు వేలూరుకోటలోని శ్రీ జలకంఠేశ్వరాలయం ఆలయాన్ని దర్శించగానే   ఇక్కడి కళాత్మక సౌరభం. గోపురాలు, మానసిక శాంతిని, అలౌకిక ఆనందాన్ని   కలిగిస్తాయి.  ఎత్తైన గోపురాలతో.. విశేషమైన వృక్ష సంపదతో.. ఆహ్లాదకరమైన వాతావరణం గోచరిస్తుంది. నిండు పున్నమి కాంతులలో     ఆలయం మరింత శోభాయమానంగా అగుపిస్తుంది.

ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఆలయం వెలుపలవున్న అఖండ జ్యోతికి నమస్కరించుకుని, దిగువన ఉన్న మెట్లద్వారా  ఆలయరాజగోపురం వద్దకు చేరుకుంటారు. గంభీరమైన రాజగోపురం సప్తకలశాలతో, ఏడు అంతస్తులతో.. విశేషమైన శిల్పకళా నైపుణ్యంతో.. వినీల ఆకాశాన్ని తాకుతున్నట్టుగా.. కానవస్తుంది.

ఆలయ ప్రాకారం రాతితో నిర్మించబడి..ప్రాకార కుడ్యంపై వివిధ దేవీదేవతలు, నందీశ్వరుని ప్రతిమలు అందంగా అమరి ఉంటాయి. ఆలయమంతా అణువణువునా శిల్పకళా సంపదతో అలరారుతోంది. దేవాలయం నాలుగు వైపులా నాలుగు కళ్యాణ మంటపాలు అగుపిస్తాయి.  46 రాతి స్తంభాలతో మంటపమంతా శిల్ప కళా శోభితమై  కనువిందు చేస్తుంది.

స్తంభాలపై అష్ట దిక్పాలకుల చిత్రాలు, వినాయకుడు, విష్ణు, బ్రహ్మ, భూదేవి, శ్రీదేవి, సరస్వతి, పార్వతి మొదలగు దేవతా మూర్తుల చిత్రాలు అత్యంత సుందరంగా చిత్రించి ఉంటాయి.  నాట్యకళాకారులు, సంగీత కారుల శిల్పాలు అద్భుతంగా మలచబడి సజీవంగా కనిపిస్తాయి. జలకంఠేశ్వరాలయంలోని కళ్యాణ మండపం  శిల్పకళా కౌశలం రీత్యా చాల అద్భుతమైనది. ఇది విజయనగరాధీశుడు సదాశివరాయల కాలంలో నిర్మితమైందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
ఆలయ రెండో గోపురం నుంచి లోపలికి వెళ్ళగానే  విఘ్నాధిపతి, తొలిపూజలందుకునే పార్వతీ తనయుడు అయిన శ్రీవలంపురి వినాయక స్వామివారు దర్శనమిస్తారు. స్వామి సంపూర్ణ రజిత కిరీటధారియై , పరిమళ పుష్పాలు,గరికతో అలంకరించబడి ఉంటారు. ఆలయ ఆవరణలో  పచ్చని కోనేరు నీటిలో ఆలయ ప్రతిబింబం సుందరంగా కానవస్తుంది.

జలకంఠేశ్వర దేవస్థానం వివిధ దేవీ దేవతల సమాహారంగా భాసిల్లుతోంది. ఆలయంలో ఒక వైపు  శ్రీ సెల్వ వినాయక స్వామి ఉపాలయం దర్శనమిస్తుంది. ఆపక్కనే శ్రీవేంకటేశ్వర పెరుమాళ్‌,  శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఉపాలయాలు ఉన్నాయి.  అక్కడే  నటరాజస్వామి, నవగ్రహాల మండపం దర్శించుకోవచ్చు.

ఆలయ ఆవరణలో శ్రీజలకంఠేశ్వరుని చెంతనే  జగదంబ శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయం  ఉంది. అమ్మవారికి ఎదురుగా తొమ్మిది అఖండజ్యోతులు నిత్యం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి. వీటి చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు.

జలకంఠేశ్వరునికి ప్రతినిత్యం విశేష పూజలు నిర్వహించి, సుగంధభరిత పరిమళ పుష్పాలతో, బిల్వపత్రాలతో,ఫలాలతో శోభాయమానంగా అలంకరిస్తారు. అనంతరం నక్షత్ర హారతి, పంచహారతి, కుంభ హారతి వంటి ప్రత్యేక హారతులు సమర్పిస్తారు. హారతి వెలుగుల్లో విశేషమైన దివ్య ప్రభలు ప్రసరింపజేస్తూ..మకరతోరణ యుక్తంగా, పంచశీర్షపు నీడలో  జలకంఠేశ్వరుడు భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తాడు. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించగానే భక్తులు భక్తిపారవశ్యంతో  హర హర మహాదేవ శంభో శంకర అంటూ ప్రణమిల్లుతారు.

ఆలయంలో  పండుగలుకార్తీకమాసం, మహాశివరాత్రి తదితర పర్వదినాలలో విశేష పూజలు జరుగుతాయి. అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయంలో దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా  జలకంఠేశ్వరుని దర్శించుకుని మహాదేవుని కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం.

చెనైకి 145 కి.మీ దూరంలో, వేలూరుకు  15కి.మీ దూరంలో ఈక్షేత్రం విరాజిల్లుతోంది.


Related Articles