NewsWaves.news

కష్ట నివారణం …. కాణిపాకం దర్శనం


మనిషి ఏ కార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా సాగాలని, ఫలవంతం కావాలని కోరుకుంటాడు. అందుకు పట్టుదల, కృషి, సంకల్పబలంతోపాటు భగవదనుగ్రహం, ఆశీస్సులు తప్పనిసరిగా ఉండాలి. అదే అదృష్టం అంటే.. కనుకనే మనం ఏ పని ప్రారంభించినా ముందుగా విఘ్నాధిపతి వినాయకుడిని పూజిస్తాం. తొలి పూజలందుకునే గణనాధుడికి పవిత్ర భారతావనిలో అనేక దేవాలయాలున్నాయి. వాటిలో ప్రశస్తమైనది ఆంధ్రప్రదేశ్ రాస్త్రంలోని కాణిపాకం.

చిత్తూరు జిల్లా బహుధా నదీతీరాన కాణిపాకం క్షేత్రంలో కొలువైన వరసిద్ధి వినాయకుడు భక్తుల కల్పతరువై కటాక్షిస్తున్నాడు. సత్యప్రమాణాలకు నెలవై భాసిల్లుతున్నాడు. అబద్ధాలాడేవారి పని పడుతున్నాడు. చారిత్రక ఆధారాలను బట్టి ఈ ఆలయం నిర్మించి వెయ్యేళ్ళయిందని తెలుస్తోంది.

పూర్వం విహారపురి గ్రామంగా చెప్పుకునే ఈ ప్రాంతంలో ఒకసారి దుర్భిక్షంతో ప్రజలు అల్లాడిపోయారు. గుక్కెడు నీరైనా దక్కని దయనీయ స్థితి ఏర్పడింది. ఆ సమయంలో అంగవైకల్యంతో బాధపడుతున్న ధర్మబద్ధులైన ముగ్గురు అన్నదమ్ములు తమ పొలంలో ఏతంవేసి బావి తవ్వుతుంటే పార ఒక బండరాయికి తగిలి రక్తం చిమ్మిందని, ఆ రక్తం చిమ్మి వారిపై పడగానే వైకల్యం మటుమాయమైందని స్థల పురాణ కథనం.

ఈ ఉదంతం తెలియగానే గ్రామస్తులు నివ్వెరపోయారు. తండోపతండాలుగా అక్కడ గుమిగూడారు. అక్కడ వారంతా బావిని తవ్వి చూస్తే గణనాథుని రూపం ప్రత్యక్షమైంది. భక్తి పారవశ్యంతో దేవదేవుడికి కొబ్బరికాయలు సమర్పించారు. ఆ కొబ్బరికాయల నీరు ఎకరం పొలం మేర పారింది. కాణి అంటే ఎకరం పొలం అని అర్థం… ఆనాటినుంచి ఈ ప్ ప్రాంతం కాణిపారకరమ్ అయింది. కాలక్రమేణా కాణిపాకంగా, పుణ్యధామంగా విస్తరించింది.

ఇక్కడి వినాయకుడిని అన్నిమతాల వారు దర్శించుకుని ఆరాధిస్తారు. భాద్రపద మాసంలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలలో హైందవేతర మతాలవారు ఎందరో పాల్గొంటారు. మతం ఏదైనా దేవుడు ఒక్కడే అనడానికి ఇంతకన్నా తార్కాణం ఏముంటుంది.?

కాణిపాకం వినాయకుడికి సత్య ప్రమాణాల దేవుడని ప్రతీతి. స్వామి సన్నిధిలో ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే ఆయనే శిక్షిస్తాడని భక్తుల నమ్మిక. అందుకనే కాణిపాకం దేవుడి ఎదుట ప్రమాణం చేద్దామా ..అంటే చాలామంది జంకుతారు. ధైర్యం చేయలేరు. ముఖ్యంగా రాజకీయ నాయకులు.


ఈ క్షేత్రంలో మరో ముఖ్యమైన విశేషం ఉంది. యాభై ఏళ్లక్రితం చేయించిన వెండి కవచం ప్రస్తుతం స్వామికి సరిపోవడం లేదు. పదిహేడేళ్ళ క్రితం స్వామివారికి భక్తులు విరాళంగా సమర్పించిన వెండి కవచం ఇప్పుడు గణనాధుడికి అలంకరించడం కష్టతరమైంది. ఇక్కడ వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడనడానికి ఇంతకన్నా ని ‘దర్శనం’ ఏముంటుంది. ?

కాణిపాకంలో మణికంఠేశ్వరస్వామి, వరదరాజస్వామి, వీరాంజనేయ స్వామి ఉపాలయాలలో పూజలందుకుంటున్నారు. చోళుల నాటి మణికంఠేశ్వరస్వామి ఆలయంలో దక్షిణామూర్తికి ప్రతి గురువారం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. వరదరాజస్వామివారి సన్నిధిలో భక్తులు సర్పదోష నివారణ పూజలు చేయించుకుంటారు. అద్భుతమైన శిల్పకళ మనల్ని తన్మయులను చేస్తుంది.

ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడి మరగదాంబిక అమ్మవారి సన్నిధిలో సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా విజయదశమి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి.

కాణిపాకం క్షేత్రంలో సంకటహర గణపతి వ్రతం, విశేష అభిషేకం, గణపతి హోమం, మోదకపూజ, ఇతర అర్చనలు ఆర్జిత సేవలుగా నిర్వహిస్తారు. స్వామి సమక్షంలో అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు విద్యలో రాణిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

వివాహం చేసుకునే నూతన జంటలకు సంసార జీవితం సాఫీగా సాగాలని కోరుతూ వినాయకుని చెంత పూజలు చేస్తారు. వివాహ తొలి పత్రికను స్వామివారి సన్నిధిలో ఉంచి పూజలు చేస్తే విఘ్నాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు.

ఇలా చేరుకోవచ్చు…ఈ క్షేత్రం చిత్తూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి, చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సులలో, ఇతర ప్రైవేటు వాహనాలలో ఇక్కడికి చేరుకోవచ్చు. తిరుపతి వరకు రైలులో గాని, విమానంలో గాని వచ్చి అక్కడినుంచి కాణిపాకం చేరుకోవచ్చు.

బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం

Related Articles