NewsWaves.news

కళాతపస్వీ …హ్యాపీబర్త్ డే

 కళాతపస్వి పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాథ్ తెలుగు సినిమాకు ఒక విశిష్టతను, ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టిన మహోన్నతుడు. ఆయన  1930 ఫిబ్రవరి 19వ తేదీన గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టారు.

చెన్నై లోని ఒక స్టూడియోలో సౌండ్ రికార్డిస్టు  గా సినీ  జీవితాన్ని ప్రారంభించిన  విశ్వనాధ్  ‘’స్వయంకృషి”తో అంచెలంచెలుగా ఎదిగారు.   అన్నపూర్ణ  సంస్థ వారి తోడికోడళ్ళు  సినిమా షూటింగ్ సమయంలో   ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు   సహాయకుడిగా పనిచేశారు.   ఆదుర్తితో కలిసి ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అక్కినేని నాగేశ్వరరావు  ఆయన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు.

 అక్కినేని కథా నాయకుడిగా నిర్మించిన ఆత్మగౌరవం సినిమాకు విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.  ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు లభించింది.  సిరిసిరిమువ్వ చిత్రంతో  విశ్వనాథ్ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి  శంకరాభరణం.   ఈ చిత్రం  జాతీయ పురస్కారం సాధించింది.  పాశ్చాత్య సంగీతపు హోరులో మరుగున పడిపోతున్న భారతీయ సంప్రదాయపు సంగీతానికి పూర్వవైభవం తీసుకురావాలని ఒక సంగీత విద్వాంసుడు తపించే ఇతివృత్తంతో సాగిన శంకరాభరణం 1980లో ఉత్తమ కుటుంబ కథాచిత్రంగా ఎంపికైంది. విశ్వనాధ్ ప్రతిభకు దర్పణంగా నిలిచింది.

ఇదే తరహాలో భారతీయ సంప్రదాయ కళలకు పట్టంకడుతూ ఆయన  అనేక  సినిమాలకు దర్శకత్వం వహించారు. కళలకు కులమతాలు అడ్డుగోడలు కారాదని, అరుదైన, అపురూపమైన, మన  సంగీత, సాహిత్య,  నాట్య కళలను ఆదరించాలనే సందేశంతో సాగరసంగమం, శృతిలయలుసిరివెన్నెలస్వర్ణకమలంస్వాతికిరణం చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు జనరంజకంగా అందించారు. విశ్వనాధ్ సినిమాలలో  సంగీత, సాహిత్యాలకు సమపాళ్లలో సముచిత స్థానం ఉండేది. కుల వివక్ష, వరకట్నం వంటి సామాజిక సమస్యలపై      విశ్వనాథ్  అనేక చిత్రాలు  తెరకెక్కించారు.   సప్తపదిస్వాతిముత్యంస్వయంకృషిశుభోదయంశుభలేఖఆపద్బాంధవుడుశుభసంకల్పం వంటి సినిమాలు ఈ కోవలోకి వస్తాయి.

శంకరాభరణానికి జాతీయ పురస్కారం,  సప్తపదికి జాతీయ సమగ్రతా పురస్కారం లభించాయి.  చలనచిత్ర రంగానికి విశ్వనాధ్ చేసిన సేవలకు మెచ్చి  భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది. నటులు ఆయన మార్గ`దర్శకత్వం’లో నటించడం తమ అదృష్టంగా భావిస్తారు. ఆయన సినిమాకు స్వరకల్పన చేయడం, పాటలు పాడటం మహాభాగ్యమని సంగీత దర్శకులు, గాయకులు సగర్వంగా చెప్పుకుంటారు. నాటి ఆత్మగౌరవం నుంచి శుభసంకల్పం వరకు ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. విశ్వనాధ్ దర్శకుడే కాదు, కొన్ని చిత్రాలలో అద్భుతంగా నటించి అందరినీ మెప్పించారు. వజ్రం, సంతోషం, స్వరాభిషేకం, నరసింహనాయుడు, ఠాగూర్, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, నీ స్నేహం, సీమసింహం, అతడు, లక్ష్మీనరసింహ, ఆంధ్రుడు, మిస్టర్ పర్ ఫెక్ట్, కలిసుందాంరా, కుచ్చికుచ్చి కూనమ్మ, స్టాలిన్ చిత్రాలలో విశ్వనాధ్ నటన హ్యాట్సాఫ్.

ఆయన అవార్డులకోసం సినిమాలు తీయలేదు. కళామతల్లి ఆశీస్సులతో అవార్డులే ఆయనను వరించాయి.

  కళాతపస్వి కె.విశ్వనాథ్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన   నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని , తెలుగు ప్రేక్షకులకు మరిన్ని మంచి సినిమాలు అందించాలని తెలుగు న్యూస్ వేవ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

 

 

Related Articles