NewsWaves.news

35 వేల బీఎస్ఎన్ఎల్ ఉద్యోగాలకు ముప్పు …?

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగాలలో భారీగా కోత పడుతుంది. గత కొన్నేళ్లుగా నష్టాలను ఎదురుకుంటున్న బీఎస్ఎన్ఎల్… రిలయన్స్ జియో రాకతో టెలికాం కంపెనీల మధ్య ఏర్పడ్డ తీవ్రమైన పోటీని తట్టుకోలేక క్రమంగా నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. దీంతో సంస్థ మనుగడ సాగించాలంటే 35 వేల మంది ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమును అమలు చేయాలని బీఎస్ఎన్ఎల్ యాజమాన్యం భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

భారత టెలికాం నియంత్రణ సంస్థ డేటా ప్రకారం గత సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ జియో రెవిన్యూ మార్కెట్ విలువ రూ.8271 కోట్లుగా ఉండగా, వొడాఫోన్ ఐడియా మార్కెట్ విలువ 7528 కోట్లుగా ఉంది. మరో ప్రధాన టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ రెవెన్యూ మార్కెట్ విలువ 6720 కోట్లు. కానీ అదే త్రైమాసికంలో ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ రెవిన్యూ మార్కెట్ విలువ కేవలం 1284 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ లెక్కలను బట్టి చూస్తే ప్రైవేట్ టెలికాం కంపెనీలను తట్టుకోలేక బీఎస్ఎన్ఎల్ ఎంత సతమతమవుతోందో అర్థమవుతుంది.

అయితే బీఎస్ఎన్ఎల్ మనుగడ సాగించాలంటే ఐఐఎం అహ్మదాబాద్ ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో సంచలన ప్రతిపాదనలు చేసినట్లుగా తెలుస్తోంది. సంస్థలోని దాదాపు 35 వేల మంది ఉద్యోగాలకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా ముగింపు పలకాలని ఆ నివేదికలో పొందుపరచినట్లుగా వ్యాపార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చాలంటే బీఎస్ఎన్ఎల్ కు 13 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఇంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వ మద్దతు ద్వారా గాని, రుణం ద్వారా గాని పరిష్కరించాలని భావిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ యాజమాన్యం తెలిపింది.

వీఆర్ఎస్ ను అమలు చేసేందుకు తమ ముందున్న అన్ని మార్గాలను పరిశీలిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీవాస్తవ వెల్లడించారు. అయితే వీఆర్ఎస్ కు సంబంధించి ప్రాథమిక నివేదిక మాత్రమే అందింది. ఇంకా తుది నివేదిక వెల్లడించాల్సి ఉంది. ఒకవేళ బీఎస్ఎన్ఎల్ వీఆర్ఎస్ కే మొగ్గుచూపితే 35 వేల మంది ఉద్యోగాలకు కోత పడినట్లే. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ లో దాదాపు 1.75 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇంత మంది ఉద్యోగులకు నిర్వహణ వ్యయం ఒక సంవత్సరానికి 15 వేల కోట్లు అవుతుంది. ఈ భారీ వ్యయాన్ని తగ్గించుకునేందుకు బీఎస్ఎన్ఎల్ ఈ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది.

Related Articles