ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు టీఆరెస్ మద్దతు

ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకు టీఆరెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. అయితే బిల్లుకు కొన్ని సవరణలు అవసరమని ప్రతిపాదించారు టీఆరెస్ ఎంపీలు. ఈబీసీ బిల్లుపై పార్లమెంట్ లో జరిగిన చర్చలో ప్రసంగించిన టీఆరెస్ సభా పక్ష నేత జితేందర్ రెడ్డి బలమైన సమాజ నిర్మాణం దిశగా జరిగే ప్రయత్నాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందని అన్నారు.

ఈ చర్చ సందర్భంగా తమ పార్టీ రూపొందించిన ముస్లిం రిజర్వేషన్ బిల్లును జితేందర్ రెడ్డి ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 8 శాతం ఉన్న ముస్లిం జనాభా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 12శాతానికి పెరిగిందని, దాని ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలని తమ పార్టీ నిర్ణయించిందని కానీ ఆ విషయం ఇప్పటి వరకు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు రాష్ట్రాల పరిధిలోనే ఉండాలని తమ పార్టీ ఎంతో కాలంగా డిమాండ్ చేస్తోందని అయన గుర్తు చేసారు. ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ మద్దతిస్తున్నట్లు జితేందర్‌ రెడ్డి ప్రకటించారు.

Related Articles