అధికారమిస్తే అదే మా మొదటి పని

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి తాము అధికారంలోకి వస్తే చేసే మొట్టమొదటి పని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఆ దేశంలో పని చేస్తున్న భారతీయ కార్మికులను కలిసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ గత సంవత్సరం మార్చిలో ఆంధ్ర ప్రదేశ్ నాయకులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారని, అయినా కేంద్రం నుండి ఎటువంటి స్పందన రాలేదని రాహుల్ గాంధీ విమర్శించారు.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీకి చేయాల్సిన ముఖ్యమైన సాయమే ప్రత్యేక హోదా అనే విషయాన్ని ప్రధాని మోడీ మర్చిపోయారని రాహుల్ ఎద్దేవా చేసారు. అందుకే తాము అధికారంలోకి వచ్చాక మొట్టమొదట ఏపీకి ప్రత్యేక హోదా హామీని అమలు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. దుబాయ్ లోని భారతీయ కార్మికుల పై రాహుల్ ప్రశంసలు కురిపించారు. దుబాయ్ అభివృద్ధిలో మీ పాత్ర కీలకమైందని అక్కడి భారతీయులను ఉద్దేశించి రాహుల్ అన్నారు. భారతీయ కార్మికుల వల్లే దుబాయ్ ప్రపంచంలోనే ఒక ప్రత్యేక నగరంగా నిలిచిందని రాహుల్ గాంధీ అన్నారు.

Related Articles